వరద నీటిలో పేషెంట్లు... బైకులపై డాక్టర్లు

బీహార్లో వరద బీభత్సం
ఆస్పత్రి వార్డుల్లోకి చేరిన వరద నీరు
పేషెంట్ల దగ్గరికి బైకులపై వెళ్తున్న సిబ్బంది
కతిహార్ (బీహార్): బీహార్‌లోని కతిహార్ జిల్లా ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా మారాయి. యాస్ సైక్లోన్ వర్షాలకు ఉప్పొంగిన వరద ఆ ఆస్పత్రిని ముంచెత్తింది. ఆస్పత్రిలో వరండాలు, అవుట్ పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంటు వార్డుల్లోకి వచ్చింది. ఆస్పత్రి అంతటా దాదాపు మోకాలు లోతు నీరు చేరింది. వార్డులోకి చేరిన నీరు, నీళ్లలోనే ఉన్న బెడ్లు, వాటిపైనే చికిత్స పొందుతున్న రోగులతో అత్యంత అధ్వాన్న పరిస్థితులు ఆ ఆస్పత్రిలో నెలకొన్నాయి.
నిర్లక్ష్యం
తుపాను వెళ్లిపోయి వర్షం తగ్గినా.. వరద నీటిని బయటకి పంపేందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలే కరోనా కాలం.... ప్రాణాపాయ స్థితిలో ఎందరో పేషెంట్లు ఈ ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో వైద్య సిబ్బంది ఆ వరద నీటిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ వరద నీటిలో ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లేందుకు బైకులు ఉపయోగిస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బీహర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
#WATCH | Waterlogging was seen in the premises of district hospital in Katihar, Bihar due to heavy rainfall yesterday. pic.twitter.com/fKRrryltEk
— ANI (@ANI) May 28, 2021