ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఆగిందా?

AstraZeneca Covid-19 vaccine study paused after one illness - Sakshi

ప్రయోగాల్లో పాల్గొన్న ఒకరికి అనారోగ్యం

ప్రయోగాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనెకా

సమీక్ష తరువాత మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రోనా వైరస్‌ మహమ్మారి నుంచి రక్షిస్తుందని అందరూ నమ్ముతున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం ఇందుకు కారణమైంది. బ్రిటన్‌లోని ఆరోగ్య వెబ్‌సైట్‌ స్టాట్‌న్యూస్‌ ప్రయోగాలు నిలిపివేస్తున్న సమాచారాన్ని ప్రకటించింది. ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, పుణే కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు జరిపిన ప్రయోగాలూ ఆగిపోతాయా? ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న ఈ టీకా తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయ్యాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనీసం 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. వేల మందిపై జరిగే ఈ మూడో దశ ప్రయోగాలు ఏళ్లపాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఒకరిద్దరు జబ్బుపడటం అసాధారణంకాదని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీకి చెందిన శాస్త్రవేత్త చెప్పారు.   

ఆస్ట్రాజెనెకా ఏం చెబుతోంది?
స్వతంత్ర సంస్థ ఒకటి ప్రయోగాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సమీక్షించనుందని, ఆ తరువాతే ప్రయోగాల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు వార్తాలొచ్చాయి. గతంలోనూ ఒకసారి ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశామని, టీకా వేసిన వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి సమస్యకు కారణం వెంటనే తెలియని పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాలు నిలిపివేస్తారని  ఆరోగ్యవార్తలను మాత్రమే ప్రచురించే స్టాట్‌న్యూస్‌ తెలిపింది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రయోగాలను పునరుద్దరిస్తారని వివరించింది.   

భారత్‌లో సాఫీగా
ఆక్స్‌ఫర్డ్‌ రెండోదశ ప్రయోగాల్లో భారత్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తెలిపింది. రెండోదశలో 100 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించామని, కీలకంగా భావించే ఏడురోజుల సమయం దాటినా ఎవరిలోనూ సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదంది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ 100 కోట్ల ఆక్స్‌ఫర్డ్‌ టీకాలను ఉత్పత్తి చేయడానికి అస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది.  

సీరమ్‌కు నోటీసు
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌పై విదేశాల్లో ప్రయోగాలు నిలిపివేసిన సమాచారాన్ని తమకు ఇవ్వనందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు బుధవారం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమేనని నిరూపణ అయ్యేంతవరకు రెండు, మూడో దశల కోసం సీరమ్‌కు ఇచ్చిన అనుమతులను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో తెలపాలని కోరింది. షోకాజ్‌కు వెంటనే బదులివ్వాలని, లేని పక్షంలో సీరమ్‌ వద్ద వివరణ ఇవ్వడానికేమీ లేదని భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డాక్టర్‌ వి.జి.సొమానీ స్పష్టం చేశారు.   

ప్లాస్మా.. పని చేయట్లేదు
వెల్లడించిన ఐసీఎంఆర్‌
న్యూఢిల్లీ: కోవిడ్‌ వైద్యంలో భాగంగాచేసే ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేదని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్‌) బుధవారం స్పష్టంచేసింది. మరణాల రేటును తగ్గించడంలో గానీ, కోవిడ్‌ తీవ్రతను తగ్గించడంలోగానీ ప్లాస్మా ప్రభావం చూపలేకపోయిందంది. ఏప్రిల్‌ 22 నుంచి జూలై 14 మధ్య 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపెన్‌ లేబెల్‌ పారలెల్‌ ఆర్మ్‌ ఫేజ్‌ 2 మల్టీ సెంటర్‌ రాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్‌(ప్లాసిడ్‌ ట్రయల్‌) పేరుతో జరిపిన పరీక్షల్లో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా వైద్య నిపుణులు.. 464 మంది కోవిడ్‌ రోగులను ఎన్నుకొని, వారిలో 235 మందికి ప్లాస్మాను ఎక్కించారు. మరో 229 మందికి సాధారణ చికిత్స చేశారు. పరీక్షలో పాల్గొన్న వారికి 24 గంటలకు ఒక్కొక్కటి చొప్పున రెండు డోసుల ప్లాస్మా ఇచ్చినట్లు తెలిపింది. ప్రతి డోసులో 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఇచ్చినట్లు పేర్కొంది.

పేషెంట్ల ఎన్‌రోల్, డేటా కలెక్షన్‌ వంటి విషయాల్లో ఐసీఎంఆర్‌ కలుగజేసుకోలేదని, అయితే పరీక్షల డిజైన్, స్టడీ కోఆర్డినేషన్, డేటా అనలైజేషన్‌ వంటి విషయాలను పరిశీలించిందని చెప్పింది. ప్లాస్మా ఇచ్చిన నాటి నుంచి 28 రోజుల వరకు వారిని పరీక్షించగా, రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడాలేమీ లేవని గుర్తించినట్లు చెప్పారు. మరణాల రేటు కూడా పెద్దగా మారలేదని తెలిపారు. కోవిడ్‌ 19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఈ పరిశోధనను పరిశీలించి ఆమోదించిందని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీ ప్రయోగించడం సురక్షితమే అయినప్పటికీ ప్లాస్మాను నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశంలో కేవలం కొన్ని సంస్థల్లోనే ఈ తరహా సదుపాయం ఉంది. దీనిపై చైనా, నెదర్లాండ్‌ లు కూడా పరిశోధనలు చేశాయి. అయితే రెండు దేశాలూ ఆయా పరిశోధనలను మధ్యలోనే ఆపేశాయి. ప్లాస్మా థెరపీని కోవిడ్‌ ఓ మోస్తరు స్థాయిలో ఉన్న వారిపైనే, పరిశోధనా పూర్వకంగా ప్రయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో తెలిపింది.

43లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌ లో కరోనా మహమ్మారి ఆగడం లేదు. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు బయట పడగా, తాజాగా గత 24 గంటల్లో 89,706 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,70,128 కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,894 మంది కోలుకోగా.. 1,115 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 73,890 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,98,844 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,97,394 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.53 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.69 శాతానికి  పడిపోయిందని తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,678 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మిలియన్‌ మందికి 37,539 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top