‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! | Assembly Polls 2026 Churn Change and the Rise of New Powers | Sakshi
Sakshi News home page

‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!

May 10 2026 7:55 AM | Updated on May 10 2026 11:03 AM

Assembly Polls 2026 Churn Change and the Rise of New Powers

భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ,  ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.

కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవం
కేరళ రాజకీయ చరిత్రలో ఎల్‌డిఎఫ్ , యూడిఎఫ్  కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.

తమిళనాట ‘విజయ్’ మేజిక్
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.

బెంగాల్‌లో తృణమూల్ వెనుకంజ
దేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ఈశాన్యంలోనూ కమలనాథుల హవా 
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన  ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.

సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?
బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కేబినెట్‌లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్‌?

Advertisement
 
Advertisement
Advertisement