Artificial intelligence: ఆరోగ్య మేధస్సు!

Artificial intelligence changing nature of medical field - Sakshi

వైద్య రంగం స్వరూపాన్ని మార్చే శక్తి ‘ఏఐ’ సొంతం

అసాధారణ అంశాలు ఇట్టే గుర్తింపు

రోగ నిర్ధారణ పరీక్షల విశ్లేషణ సామర్థ్యం

రోబోటిక్‌ సర్జరీల్లో కచ్చితత్వం వృద్ధి

క్లినికల్‌ డేటాలో నాణ్యత 

వినూత్న ఆవిష్కరణలకు అవకాశం

ఆసుపత్రులపై తగ్గనున్న పని ఒత్తిడి

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): కోవిడ్‌ మహమ్మారి విసిరిన సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపిస్తోంది. వైద్య, ఆరోగ్య రంగం స్వరూపాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) పూర్తిగా మార్చేస్తోంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ముందే హెచ్చరిక జారీ చేయడం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించడం, మెడికల్‌ పారామీటర్స్‌ను విశ్లేషించడం, జబ్బు రాకుండా నివారించడం, రోగాలను గుర్తించడంలో కచ్చితత్వం, డాక్టర్ల అపాయింట్‌మెంట్స్‌ ఖరారు, మందుల వాడకాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయడం.. ఎన్నో పనులను సులభంగా, చౌకగా చేయడానికి ఏఐ శక్తినిస్తోంది. 

రూపు మారుతున్న వైద్య రంగానికి సప్త మార్గాలు
పేషెంట్‌ కేంద్రం వైద్యారోగ్యరంగం విప్లవాత్మక మార్పులవైపు అడుగులు వేస్తోంది. సరికొత్త లక్ష్యాల దిశగా సాగుతున్న ప్రయాణంలో 7 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 

వేరియబుల్స్, యాప్స్‌
స్మార్ట్‌వాచ్‌ల లాంటి వేరియబుల్స్, యాప్స్‌ వ్యక్తుల ఆరోగ్య సూచీలను డేటాను సేకరించి, ప్రాసెస్‌ చేసి, ఆయా వ్యక్తులకు రియల్‌టైంలో సలహాలు/హెచ్చరికలు జారీ చేస్తాయి. ఉదాహరణకు మధుమేహ స్థాయిలని ట్రాక్‌ చేసి పర్సనలైజ్డ్, రియల్‌టైం సూచనలు, సలహాలు ఇస్తాయి. ధరించిన వ్యక్తికే కాకుండా మనం సూచించిన దగ్గరి వ్యక్తులకు, ఫ్యామిలీ డాక్టర్‌కు కూడా ఈ సూచనలు చేరవేస్తుంది.

ముందుగా గుర్తించడం
స్మార్ట్‌వాచ్‌లు, బయోసెన్సర్స్, ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ మన గుండె కొట్టుకుంటున్న తీరు, ఊపిరి తీసుకుంటున్న విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, అసాధారణ తీరు ఉంటే వెంటనే యూజర్‌కు విషయాన్ని చెబుతుంది. విషమ పరిస్థితులు ఏర్పడి చేయిదాటి పోకముందే ముందస్తు హెచ్చరికలను నోటిఫై చేస్తుంది. యాక్సలరోమీటర్‌ బ్రేస్‌లెట్స్, స్మార్ట్‌బెల్ట్స్‌.. వృద్ధులు పట్టుకోల్పోవడం, డీహైడ్రేషన్‌కు గురవటం, కిందపడిపోవడం లాంటి అంశాల గురించి బంధువులు, వైద్యులు, అత్యవసర వ్యవస్థకు నోటిఫికేషన్‌ జారీ చేయగలుగుతాయి.

తక్షణ సాయం అందించే 108 లాంటి అంబులెన్స్‌ వ్యవస్థకు స్థలం, పరిస్థితిని తెలియజేసే నోటిఫికేషన్లు రావడం వల్ల తక్షణం బాధితులను ఆసుపత్రికి చేర్చి వైద్య సహాయం అందించడానికి వీలవుతుంది. విలువైన ప్రాణాలను రక్షించడానికి ఏఐ  అవకాశం కల్పిస్తుంది. నిర్ణీత సమయంలో ఏ పరిస్థితులు తలెత్తాయనే అంశాలను రికార్డు చేసి విశ్లేషించే సామర్థ్యం కూడా ‘ఏఐ‘ ఉన్న ఉపకరణాలకు ఉంటుంది.

వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా..
వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు చెబుతున్న విషయాన్ని, డాక్టర్‌ సూచించిన మెడికేషన్‌ను నోట్‌ చేసుకొని కేస్‌షీట్‌ను జనరేట్‌ చేయడమే కాకుండా క్లినికల్‌ డేటాను తప్పులు లేకుండా రికార్డు చేయగలిగే ఉపకరణాలు వచ్చే దశాబ్దంలో అన్ని ఆసుపత్రుల్లో మనకు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు, సిబ్బంది మీద పని ఒత్తిడి తగ్గి రోగి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆసుపత్రుల్లో ఈ ‘వర్చువల్‌ అసిస్టెన్స్‌’ మార్కెట్‌ 2027 నాటికి దాదాపు 3 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఫలితాల విశ్లేషణ
రోగ నిర్ధారక పరీక్షల ఫలితాలను ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో మాన్యువల్‌గా విశ్లేషిస్తున్నారు. ఫలితాలను నూరు శాతం కచ్చితత్వంతో విశ్లేషించే సామర్థ్యం ‘ఏఐ’కి ఉంది. శాంపిల్‌ను లోడ్‌ చేస్తే ఫలితాల విశ్లేషణ నివేదిక త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇది సాకారమైతే రోగ నిర్ధారణ పరీక్షల్లో మానవ తప్పిదాలను పూర్తిగా నివారించి కచ్చితత్వం ఊహించని స్థాయికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వర్చువల్‌ కన్సల్టేషన్‌
డాక్టర్లతో వర్చువల్‌గా మాట్లాడి చికిత్స పొందడానికి ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఉపయోగపడతాయి. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ను నిర్దారించడం మొదలు సలహా తీసుకోవడం, మందులు ఇంటికి డెలివరీ, మందులు వాడుతున్న విధానం, డోసేజ్‌ను మానిటర్‌ చేయడం, రోగుల ఫీడ్‌బ్యాక్‌ డాక్టర్లకు చేరవేయడం.. ఇప్పుడు ఏఐ అప్లికేషన్లు చేయగలుగుతున్నాయి.

వైద్య రంగం మీద ఒత్తిడి తగ్గుతుంది
వినూత్న ఆవిష్కరణకు అవకాశం: సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఇటు రోగులకు సులభంగా వైద్య సేవలు పొందే అవకాశం రావడంతో పాటు, అటు వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు వస్తాయి. ఆసుపత్రులు, హెల్త్‌కేర్‌ సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుంది. రోగాల నివారణ మీద ఎక్కువ సమయం వెచ్చించడానికి డాక్టర్లకు సమయం దొరుకుతుంది.

► వైద్య, ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యం, చికిత్స అందించే వేగం పెరగడానికి ‘ఏఐ’ దోహదం చేస్తుంది. ఫలితంగా తక్కువ వ్యయంతో ఎక్కువ మందికి మెరుగైన చికిత్స అందించడం ప్రభుత్వాలకు సాధ్య
మవుతుంది.

రోగుల సాధికారత: రోగి వైద్యం కోసం ఆసుపత్రి మొట్లు ఎక్కిన దగ్గర నుంచి చికిత్స ముగిసే వరకు ప్రతి అంశం రికార్డు అవుతుంది. మళ్లీ జబ్బు చేసినప్పుడు అంతకుముందు ఏ చికిత్స తీసుకున్నారనే విషయం డాక్టర్‌కు అందుబాటులోకి ఉంటుంది. ఆసుపత్రికి రాకుండా 
కూడా చికిత్స పొందడానికి రోగికి అవకాశం ఉంటుంది. 

రోబోటిక్‌ సర్జరీ
సర్జరీల్లో రోబోలను ఉపయోగించడం ఇప్పుడు అసాధారణ విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో కిడ్నీ సర్జరీల్లో రోబోలనువాడటం వల్ల సక్సెస్‌ రేట్‌ 52 శాతం పెరిగిందని తేలింది. పూర్తిస్థాయిలో ‘ఏఐ’ బ్యాకింగ్‌ ఉన్న రోబోటిక్‌ సర్జరీలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగి డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది మీద ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

రిహాబిలిటేషన్‌
చికిత్సలో రిహాబిలిటేషన్‌ ముఖ్యమైన అంశం. సర్జరీ/చికిత్స పూర్తయిన తర్వాత సక్రమంగా మెడికేషన్‌ కొనసాగించాలి. ‘ఏఐ’ యాప్స్, ఉపకరణాలు ‘కేర్‌ మేనేజ్‌మెంట్‌’లో కీలకం కానున్నాయి. రోగులు కోలుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకోమని గుర్తు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. రోగుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని డాక్టర్లకు చేరవేసి ‘మెడికేషన్‌’లో మార్పులు చేర్పులను రోగికి అందించగలవు. వైద్యరంగం పరిశోధనకు కూడా ఈ డేటా ఉపయోపడుతుంది. ఇదంతా ఇప్పటికి ఊహాజనితంగా ఉన్నా వాస్తవరూపం దాల్చే రోజు దగ్గర్లోనే ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top