1 నుంచి 7 నంబర్ల వెనుక దాగున్న రహస్యం ఇదే
2, 4, 5 సురక్షితం.. 3, 6, 7 డేంజర్, 1 ఓకే
మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్ నుంచి లంచ్ బాక్సుల వరకు ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగున ఒక చిన్న త్రిభుజం.. అందులో ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? అసలు ఆ నంబర్లు దేనిని సూచిస్తాయి? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం? ఎంత వరకు ప్రమాదకరం? ఈ ఆసక్తికర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ప్లాస్టిక్ వర్గీకరణ..
సొసైటీ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ (ఎస్‌పీఐ) అనే సంస్థ 1988లో ప్లాస్టిక్‌ను ఏడు రకాలుగా వర్గీకరించింది. ఈ వర్గీకరణ వ్యవస్థను రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ (ఆర్‌ఐసీ) అని పిలుస్తారు. ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటికున్న రీసైక్లింగ్ సామర్థాన్ని బట్టి వాటికి 1 నుంచి 7 నంబర్లను కేటాయించారు.
1 పీఈటీ: సాఫ్ట్ డ్రింక్ సీసాలు, వాటర్ బాటిళ్ల తయారీకి ఈ రకం ప్లాస్టిక్‌ని వాడతారు. వాటిని పదేపదే ఉపయోగిస్తే యాంటిమోనీ అనే హానికర రసాయనాలు వెలువడవచ్చు. అత్యధికంగా రీసైకిల్ అవుతున్న ప్లాస్టిక్ ఇది.
2హెచ్‌డీపీఈ: పాల డబ్బాలు, షాంపూ బాటిళ్లు, డిటర్జెంట్ డబ్బాలకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. రసాయనాల విడుదల తక్కువ. సులభంగా రీసైకిల్ చేయవచ్చు.
3 పీవీసీ (వినైల్): పైపులు, పిల్లల బొమ్మలు, క్లింగ్ ఫిల్ములు (గాలి చొరబడకుండా గిన్నెలపై మూతలుగా వాడే ప్లాస్టిక్ షీట్స్) తయారు చేసేందుకు వాడతారు. అయితే దీన్ని ‘పాయిజన్ ప్లాస్టిక్’అంటారు. ఇందులో కేన్సర్ కారక డయాక్సిన్లు, థాలేట్లు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం.
4 ఎల్‌డీపీఈ: ప్లాస్టిక్ కవర్లు, బ్రెడ్ ప్యాకెట్‌లకు వాడతారు. ఇది కూడా కొంతవరకు సురక్షితమైనదే. కొన్ని అవసరాలకు మాత్రమే రీసైకిల్ చేస్తారు.
5 పీపీ: పెరుగు కప్పులు, సిరప్ బాటిళ్లు, వేడి ఆహార కంటెయినర్లకు వాడతారు. వేడిని తట్టుకుంటుంది. దీనిని కూడా సురక్షితమైన రకంగానే పరిగణిస్తారు. రీసైక్లింగ్ సాధ్యమే.
6 పీఎస్ (పాలీస్టెరీన్): ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, టీ–కప్పులు, ప్యాకింగ్ మెటీరియల్, ఎగ్ కార్టన్స్, ధర్మోకోల్ తయారీకి వాడతారు. వేడి తగిలితే స్టెరీన్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా దీనిని రీసైకిల్ చేయరు. చేయడం కూడా కష్టం.
7 ఇతర ప్లాస్టిక్‌లు: నైలాన్, సన్ గ్లాసెస్, బేబీ బాటిల్స్ (కొన్ని రకాలు) తయారు చేస్తారు. ఇది మిశ్రమ ప్లాస్టిక్. రీసైక్లింగ్ దాదాపు అసాధ్యం.
పర్యావరణ నిపుణుల సూచనల ప్రకారం 2, 4, 5 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వాడటం కొంత వరకు సురక్షితం. కానీ 3, 6, 7 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారాన్ని ఓవెన్‌లో వేడి చేయడం లేదా వేడి పదార్థాలను ఉంచడం మానుకోవాలి. ఈసారి మీరు కొనే ప్లాస్టిక్ బాటిల్ అడుగున నంబర్ చూడటం మర్చిపోకండి!


