AR Rahman Counter Tweet: అమిత్‌ షా కామెంట్లపై ఏఆర్‌ రెహమాన్‌ కౌంటర్‌

AR Rahman Counter Tweet On Amit Shah Hindi Comments - Sakshi

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ‘హిందీ కామెంట్లు’ సోషల్‌ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. ఒకరినొకరు హిందీలోనే పలకరించుకోవాలని, ఇంగ్లిష్‌లో సంభాషించుకోవడానికి వీల్లేదంటూ వ్యాఖ్యానించారు షా. ఈ కామెంట్లపై వ్యతిరేకత మొదలుకాగా, మరోవైపు రాజకీయమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సదరు వ్యాఖ్యలపై ఒక ఫొటోతో అమిత్‌ షా కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రియమైన తమిళం..’ అంటూ భాషాభిమానం ప్రదర్శిస్తూ ఓ ఫొటోను షేర్‌ చేశారాయన. ఆ ఫొటో తమిళ దేవతకు చెందింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మూడింటిలోనూ ఆయన ఆ ఫొటోను షేర్‌ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ కంపోజ్‌ చేసిన, మనోమణియమ్‌ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని పదాలను ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్‌ రెహమాన్‌. మన ఉనికికి మూలం ప్రియమైన అని 20వ తమిళ కవి భరతిదశన్‌ రాసిన ‘తమిళియక్కమ్‌’ కవితా సంకలనంలోని ఓ లైన్‌ను ఆ ఫొటోపై క్యాప్షన్‌గా  ఉంచారాయన. 

అయితే రెహమాన్‌ ఇలా భాషకు సంబంధించిన చర్చల్లో.. కామెంట్‌ చేయడం ఇదేం కొత్త కాదు. జూన్‌ 2019లో ప్రతి రాష్ట్రంలోనూ మూడు భాషల పాలసీని తప్పనిసరి చేయాలంటూ కేంద్రం ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆ టైంలో ‘అటానమస్‌’ కేంబ్రిడ్జి డిక్షనరీలోని పదం అంటూ ట్వీట్‌ చేసి.. తమిళనాడు అటానమస్‌ #autonomousTamilNadu హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా పెద్ద చర్చకే దారి తీశారు. అలాగే హిందీ కంప‍ల్సరీ అనే ప్రతిపాదనను సైతం కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు.. మంచి నిర్ణయం. హిందీ తమిళనాడులో తప్పనిసరేం కాదు అంటూ మరో ట్వీట్‌ చేశారు ఏఆర్‌ రెహమాన్‌.

గురువారం జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే మాధ్యమమే అధికార భాష అని, దీని వల్ల హిందీకి ప్రాధాన్యత పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని చెప్పారు. అంతేకాదు ఇకపై దేశం ఐక్యంగా ఉండాలంటే ఇతర రాష్ట్రాల వాళ్లు హిందీలోనే మాట్లాడుకోవాలంటూ సూచించారాయన. ఈ వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్‌లు పడుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం దేశ ‘బహుత్వ గుర్తింపు’ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని, షా కామెంట్లు ఐక్యత్వాన్ని దెబ్బ తీసేలానే ఉన్నాయని పేర్కొన్నారు  తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.

చదవండి: సారూ అదేం పని.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top