Anand Mahindra: మొబైల్‌ ఫోన్‌ వాడుతూ రెండుసార్లు ప్రమాదం | Sakshi
Sakshi News home page

Anand Mahindra: మొబైల్‌ ఫోన్‌ వాడుతూ రెండుసార్లు ప్రమాదం

Published Tue, Jun 8 2021 3:18 PM

Anand Mahindra Tells Us Why Should Not Use Our Phones On The Move - Sakshi

ముంబై: ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. గేమ్స్ ఆడడం, పాటలు వినడం, సినిమాలు చూడటం కోసం మొబైల్‌ ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారు. కొంతమంది నడుస్తున్నప్పుడు.. తింటున్నప్పుడు.. అదే పనిగా సెల్‌ పోన్‌లను వాడుతుంటారు. అయితే ఇలా వాడటం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనిపై తాజాగా ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మొబైల్‌ ఫోన్‌లను అతిగా వాడితే జరిగే అనర్థాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ‘‘నేను మొబైల్‌ ఫోన్‌ను వాడుతున్నప్పుడు రెండు ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ట్రావెల్‌ చేస్తున్నప్పుడు నా ఫోన్‌ని జేబులోనే ఉంచుకుంటాను. ఈ వీడియోను పంచుకున్నందుకు ఎరిక్సోల్హీమ్‌కు ధన్యవాదాలు.’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.9 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు వీధుల్లో నడుస్తున్నప్పుడు తమ సెల్‌ ఫోన్‌లను ఉపయోగిస్తూ ప్రమాదానికి గురవుతారు. వీడియోలోని ప్రతి ఒక్కరూ మొబైల్‌ ఫోన్‌లలో చూస్తూ.. తమ ముందు ఉన్న దాన్ని గమనించకపోవడంతో ప్రమాదంలో పడతారు. ఇక ఓ మహిళ డ్రైవింగ్ చేస్తూ సెల్‌ ఫోన్‌లోకి చూడటంతో ప్రమాదానికి గురవుతుంది. అయితే దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..  ‘‘ నేను ఊహించని ప్రమాదం జరిగింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్‌ బ్యాక్‌ని చూస్తూ పురుషుల రూంలోకి వెళ్లాను.’’ అని కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ ‘‘ ఇది నిజంగా ఓ మంచి సందేశం. కానీ దురదృష్టవశాత్తు మనం ప్రాథమిక భద్రతా చర్యలను విస్మరిస్తాం.’’ అంటూ రాసుకొచ్చారు.
 


(చదవండిః కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు)

Advertisement
Advertisement