
న్యూఢిల్లీ: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై వేగంగా వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని సకాలంలో గుర్తించడంతో టేకాఫ్‌ను రద్దు చేశారు. ఆ సమయంలో గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేందుకు పైలట్లు బ్రేకులు వేసి, ప్రమాదం జరగకుండా చూశారు.
సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాల్సిన ఏఐ2403 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు తమ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించి టేకాఫ్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన దరిమిలా ప్రయాణీకులంతా దిగిపోయారని, ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
సోమవారం ఈ ఘటనకు ముందు ముంబైలో కొచ్చికి వెళుతున్న విమానం వర్షంలో తడిసిన రన్‌వేను తప్పించుకుని, విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం తలెత్తింది. ఒక ఇంజిన్‌తో పాటు రన్‌వే కూడా దెబ్బతింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా గత ఆరు నెలల్లో ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలియజేసింది. గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతిచెందారు. 11ఏ సీటులో ఉన్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.