ఏడాదిలో కిడ్నీ మార్పిడులు 11,423 | Sakshi
Sakshi News home page

ఏడాదిలో కిడ్నీ మార్పిడులు 11,423

Published Mon, Apr 3 2023 8:45 AM

11 423 Kidney Transplants During The Year 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో కిడ్నీ మార్పిడి చికిత్సలు గణనీయంగా పెరిగాయి. ఒక్క 2022 ఏడాదిలోనే ఏకంగా 11,423 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా వెల్లడించింది. పదేళ్లలో ఈ చికిత్సలు దాదాపు మూడింతలు పెరిగినట్టు తెలిపింది. 2013లో 4,037 కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఆ తర్వాత ఏటా పెరుగుతూ 2019లో 9,751కు చేరాయి. కరోనా కారణంగా 2020లో 5,488, 2021లో 9,105 శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు అవయవ దానానికి ముందుకొస్తున్నవారిలో పెరుగుదల కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కిడ్నీ బాధితులు దాతల కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. 

కిడ్నీ చికిత్సలే అధికం
సాధారణంగా కిడ్నీ, పాంక్రియాస్, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి ఆయా అవయవాలను మార్పిడి చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలు కలిపి 2013లో 4,990 జరగ్గా.. 2022 నాటికి 15,561కి పెరిగాయి. ఇందులో అధికంగా 11,423 కిడ్నీ మార్పిడి చికిత్సలే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఇక కాలేయ మార్పిడి చికిత్సలు 3,718, గుండె మార్పిడులు 250, ఊపిరితిత్తుల మార్పిడులు 138, పాంక్రియాస్‌ 24, కిడ్నీ–పాంక్రియాస్‌ 22 చికిత్సలు జరిగాయి. 

‘బ్రెయిన్‌డెడ్‌’ దాతల నుంచి..
2022లో దేశవ్యాప్తంగా బ్రెయిన్‌డెడ్‌ అయినవారి నుంచి సేకరించిన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇలా 655 శస్త్రచికిత్సలు జరగగా.. తమిళనాడులో 553, కర్ణాటక 435, గుజరాత్‌ 399, మహారాష్ట్రలో 305 అవయవ మార్పిడులు జరిగినట్టు తెలిపింది. ఇక బతికున్నవారి దాతల (లివింగ్‌ డోనర్‌) నుంచి తీసుకున్న అవయవ మార్పిడిలో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,623 లివింగ్‌ డోనర్‌ అవయవ మార్పిడులు జరిగాయి. తర్వాత తమిళనాడు 1,691, మహారాష్ట్ర 1,211, కేరళ 979, పశ్చిమబెంగాల్‌ 928 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. 

పెద్ద సంఖ్యలో బాధితులు
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, శస్త్రచికిత్సలు చేసే సదుపాయాలు అంతటా అందుబాటులోకి వచ్చినా.. అవయవాలు దొరక్క చాలా మంది బాధితులు ఇబ్బందిపడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తూనే.. పరిస్థితి విషమించి మరణిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2019 నాటి లెక్కల ప్రకారం.. అంతకుముందు ఆరేళ్లలో తెలంగాణలో 4,728 మందికి అవయవ మార్పిడి అవసరమైతే, 2,402 అవయవాలు మాత్రమే అందించగలిగారు. 

జీవన్‌దాన్‌ నెట్‌వర్క్‌తో.. 
ప్రమాదాల్లో మరణించిన, బ్రెయిన్‌డెడ్‌ అయినవారి నుంచి అవయవాలను సేకరించి.. అవసరమైన వారికి అందించేందుకు జీవన్‌దాన్‌ నెట్‌వర్క్‌తో కీలకంగా పనిచేస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆస్పత్రుల్లోని రోగులకు రొటేషన్‌ పద్ధతిలో అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. అవయవాలు కావాల్సిన రోగులు ప్రభుత్వ జీవన్‌దాన్‌ వెబ్‌సైట్‌లో పేరు, వివరాలు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్‌ నంబర్‌ ఇస్తారు. అవయవ దాతలు దొరికినప్పుడు సీరియల్‌ నంబర్‌ ప్రకారం రోగులకు చికిత్సలు చేస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు అవయవ మార్పిడిపై అవగాహన కల్పించి, ఒప్పించేదిశగా జీవన్‌దాన్‌ కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు చేస్తున్నాయి. 

Advertisement
Advertisement