సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు.
సంఘర్షణ నిర్మూలన కోసం..
అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు.
పరిహారం అందితేనే రీలొకేషన్‌కు..
నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు.
స్పష్టత కరువు
నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది.
నల్లమలలో చెంచుపెంటల
తరలింపు ప్రక్రియ వేగవంతం
మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు
మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు
పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు


