● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
● కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు తప్పదు
నారాయణపేట రూరల్: అహంకార ధోరణితో పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టిన గతే 2028 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళా చైతన్యాన్ని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకోవడం బాధాకరమన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కారణమని విమర్శించారు. నెహ్రూ కుటుంబంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీని శాసించవచ్చు కానీ.. సాధారణ మహిళలు కనీసం ప్రజాప్రతినిధులుగా పనిచేయుటకు అనర్హులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం నిధులతోనే..
రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరు చేస్తుంటే.. రాష్ట్ర పాలకులు అసెంబ్లీ వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 12 గ్రీన్ ఫీల్డ్, రూ.85 వేల కోట్ల రైల్వే లైన్, రెండు ఎయిర్‌పోర్టులు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేమి కనపడవన్నారు. ఎలాంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్న రేవంత్‌రెడ్డికి పాలన ఎలా చేయాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు తప్పా.. అభిమానంతో కాదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగపాండురెడ్డి, కొండయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, జిల్లా నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీకాంత్, లహోటి, బలరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, సాయిబన్న, వినోద్, కిరణ్ పాల్గొన్నారు.


