పొగమంచుతోవాహనదారులు జాగ్రత్త
నారాయణపేట: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని, అత్యవసరమైతే వాహనాలను నెమ్మదిగా, సురక్షితంగా నడిపి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని, తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుదని తెలిపారు. హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. ప్రయాణానికి ముందే ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. పోలీసుల సూచనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
23న ‘మీ డబ్బు,మీ హక్కు’పై ప్రత్యేక శిబిరం
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులు (సొమ్ము) సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 23న కలెక్టరేట్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ పొదుపులు, ఇన్ష్సూరెన్స్ ఖాతాలు, తదితరాలు వాటిని పరిష్కరించాలనే తలంపుతో ఆర్బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ బ్యాంకులు ఉమ్మడి శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం 31 వరకు కొనసాగుతుందని, బ్యాంకుల్లో 10 సంవత్సరాలకుపైగా క్లెయిమ్ చేసుకొని డిపాజిట్ల వివరాలు (https://udham.rbi.org.in/uncaimed-deposits/#/login) ద్వారా పొందవచ్చని , క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ, బీమా సంస్థని సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
విద్యార్థులు సబ్జెక్టులో పట్టు సాధించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు ఇంజినీరింగ్ సబ్జెక్టులలో పట్టు సాధించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంజినీరింగ్ పరిధి చాలా పెరిగిందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు కూడా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి బాధ్యతాయుతంగా నడుచుకుంటే భవిష్యత్‌లో వచ్చే విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటారని సూచించారు. ఎక్కువ సమయం చదువులకు కేటాయించాలని, ఇక్కడ ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, మహమ్మద్‌గౌడ్, రామరాజు, తేజవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
పొగమంచుతోవాహనదారులు జాగ్రత్త


