హోంగార్డుల సామర్థ్యాలు పెంపునకు క్రీడా పోటీలు
నారాయణపేట: హోంగార్డ్స్ రైజింగ్ డే (డిసెంబర్ 6 ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలను అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్ పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. హోంగార్డుల మధ్య వాలీబాల్, కబడ్డీ, 100 మీటర్ల రన్నింగ్, 200 మీటర్ల రన్నింగ్ వంటి పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతి విభాగంలో పాల్గొన్న హోంగార్డులు తమ శారీరక సామార్థ్యాన్ని, క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చారు. క్రీడలు హోంగార్డుల ఆరోగ్య పరిరక్షణ, స్ట్రెస్ తగ్గింపు, విధి నిర్వహణ సామర్థ్యాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయని అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రతి హోంగార్డ్ పాత్ర ఎంతో కీలకమని, రైజింగ్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి సేవలను గుర్తించడమే అన్నారు. ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతలకు రైజింగ్ డే రోజు ఎస్పీ చేతుల మీదుగ బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు శివశంకర్, మద్దయ్య, హోంగార్డులు పాల్గొన్నారు.


