చోరీ చేసిన ఫోన్లతో నేర కార్యకలాపాలు | - | Sakshi
Sakshi News home page

చోరీ చేసిన ఫోన్లతో నేర కార్యకలాపాలు

Dec 6 2025 9:18 AM | Updated on Dec 6 2025 9:18 AM

చోరీ చేసిన ఫోన్లతో నేర కార్యకలాపాలు

చోరీ చేసిన ఫోన్లతో నేర కార్యకలాపాలు

నారాయణపేట: జిల్లావ్యాప్తంగా మూడు నెలల కాలంలో దొంగిలించబడిన, పోయిన మొబైల్‌ ఫోన్ల ను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా వాటిని ట్రేస్‌ చేసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ తెలపా రు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్వాధీనం చేసుకున్న 106 ఫోన్లను శుక్రవారం తిరిగి బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో గాని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో గాని వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. మొబైల్‌ దొంగతనం చేసిన వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దొంగిలించిన ఫోన్లతో నిందితులు నేర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్లు కొనరాదన్నారు. ప్రజలు వ్యక్తిగత మొబైల్‌ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. జిల్లాలోని ఐటీ కోర్‌ పోలీసులు ఆధునాతన టెక్నాలజీ సాయంతో మొబైల్‌ ఫోన్ల ట్రేస్‌ చేసి స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక చొరువ చూపారని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు ఎన్‌.లింగయ్య, మహేష్‌, సీఐలు శివశంకర్‌, రాజేందర్‌రెడ్డి, రామ్‌లాల్‌, సైదులు, ఐటీ కోర్‌ ఎస్‌ఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన ఆర్టీఓ అధికారులు

నారాయణపేట: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ను జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు మెగా గాంధీ, సాయితేజ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రహదారి భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నివారణ, డ్రైవింగ్‌ అవగాహన కార్యక్రమాలపై ఎస్పీ, ఆర్టీఓ అధికారులు చర్చించుకున్నారు. భవిష్యత్‌లో పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ కలిసి జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలను చేపట్టాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

క్రీడలు వ్యక్తిత్వాన్నిపెంపొందిస్తాయి

నారాయణపేట: క్రీడలు మనిషిలో క్రమశిక్షణ, ఓర్పు, సహనం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ఉత్సాహభరితంగా ముగిశాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం విజేత మక్తల్‌ జట్టుకు, రన్నర్‌ టీమ్‌ మరికల్‌ జట్టుకు నగదు బహుమతితో పాటు షీల్డ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి యువకుడు యూనిఫాం లేని పోలీస్‌ అని, సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని సూచించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు సునంద హస్పిటల్స్‌ డాక్టర్‌ ప్రసాద్‌శెట్టి, రన్నర్స్‌కు రూ.5 వేలు, షీల్డ్‌ కిడ్స్‌ హాస్పిటల్‌ డా. మధుసూదన్‌రెడ్డి స్పాన్సర్‌ చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రియాజ్‌ హుల్‌ హక్‌, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌, డాక్టర్లు ప్రసాద్‌శెట్టి, మధుసూదన్‌రెడ్డి, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, రాజేందర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐ రమణ, క్రీడా కారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement