నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి
మాగనూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు అన్నారు. శనివారం సంబంధిత అధికారి అమన్‌కుమార్ తదితరులు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిరుపేద ప్రజల కల నెరవేర్చడానికి ఈ పథకం తీసుకురావడం జరిగిందన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుండటం అభినందనీయం, లబ్ధిదారులు అధికారుల సూచనలు పాటిస్తూ ఇళ్లు నిర్మించుకోవాలని అన్నారు. ముఖ్యంగా అధికారులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ డిప్యూటీ డీఈ హరికృష్ణ, ఉమ్మడి మండల హౌసింగ్ ఏఈ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


