విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్ అన్నారు. పట్టణంలోని రవితేజ స్కూల్ లో శుక్రవారం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచి చదువుతోపాటు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, ఉపాధ్యాయులు విద్యతో పాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. సైన్స్ పై అవగాహన కలిగి ఉండి కొత్త విషయాలను కనిపెట్టేందుకు ప్రోత్సహించాలన్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, సంస్కృతి అంశాలకు సమయానికి కేటాయించాలన్నారు. పిల్లల మానసికోన్నతికి యోగా, మెడిటేషన్ చేయించాలన్నారు. న్యాయ శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 15100 టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీపతి గౌడ్, సురేష్, యాదయ్య శెట్టి, బాలస్వామి, రూపిక, శాలిని పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


