
సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలి
నారాయణపేట: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ డాక్టర్ రవీందర్‌నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్‌తో కలిసి జాతీయ కార్యక్రమాల ప్రగతిని తెలుసుకొని, కార్యాలయంలో కలిసి ప్రోగాం అధికారుల నివేదికలను సమీక్షించారు. జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో ఎనరల్ చేసి డైలీ రిపోర్ట్ ఎంట్రీ అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. అంతకుముందు మరికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, కాన్పు గదులు, స్టోర్ రూం, ల్యాబ్, పేషెంట్ అడ్మిషన్ వార్డులను పరిశీలించారు. అదే విధంగా వైద్యాధికారి రాఘవేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రావణ్, సిబ్బందితో అన్ని జాతీయ కార్యక్రమాలు నివేదికలను పరిశీలించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ డేటా ఒకే విధంగా ఉండాలని సూచించారు. వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి సిబ్బంది ద్వారా అందే సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సత్యప్రకాష్ రెడ్డి, సుధీష్ణ, డీపీఓ బిక్షపతి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.