
టార్పాలిన్లు అందేనా..
మక్తల్: పంట కోతల తర్వాత అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగించే టార్ఫాలిన్లను ప్రభుత్వం పదేళ్లుగా అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది వర్షాకాలంలో టార్ఫాలిన్ల కొరత కారణంగా ధాన్యం తడిసి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చిన్న, సన్న కారు రైతులకు రూ.వేలు ఖర్చు చేసి టార్ఫాలిన్లు కవర్లు కొనుక్కోవడం భారంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సబ్సిడీపై అందించే టార్ఫాలిన్లను మళ్లీ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో 1.14లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది, వివిధ పంటలను సాగు చేశారు. పంట కోతల సమయం ప్రారంభం కావడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నా.. సాయంత్రం అయిందంటే చాలు నల్లమబ్బు కమ్మి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండిన ధాన్యాన్ని రాశులుగా పోసిన వాటిపై కప్పేందుకు సరైన టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవడంతో వారి కష్టం అంతా వరద పాలవుతోంది.
రైతులకు ఆర్థిక భారం
గతంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సమన్వయంతో రైతులకు రాయితీపై టార్ఫాలిన్లు పంపిణీ చేసేవారు. 250 జీఎస్‌ఎం నాణ్యత కలిగిన 8–6 మీటర్ల విస్తీర్ణం ఉన్న టార్ఫాలిన్ రూ.2,500 కాగా.. 50 శాతం రాయితీపై రూ.1,250 లకు అందించేవారు. కానీ 2017–2018 సంవత్సరం నుంచి ఈ పథకం అమలును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటులో ఒక్కో టార్ఫాలిన్ రూ.3,500 నుంచి రూ.8వేల వరకు పలుకుతుండడంతో సన్నకారు రైతులతో పాటు దాదాపు 1.25 లక్షల మంది రైతులపై భారం పడుతోంది.
10 ఏళ్ల నుంచి రైతులకు తప్పని ఎదురుచూపులు
సబ్సిడీ కవర్లపై స్పందించని వ్యవసాయ శాఖ
రూ.వేలు ఖర్చు చేసి బయట కొనుగోలు చేస్తున్న వైనం
జిల్లాలోని 1.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు
పంట కోతలు సమీపిస్తున్న తరుణంలోఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు