
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణంతో పాటు శ్రీపడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు రూ. 153 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూ. 833.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కాగా, పడమటి ఆంజనేయస్వామి జాతర నాటికి కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రాణేశ్‌కుమార్, ఈఓ సుందరాచారి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్‌గౌడ్, నాగరాజు, గోవర్ధన్, దండు రాము, శ్రీనివాసులు, తాయప్ప, రవికుమార్, సురేశ్ పాల్గొన్నారు.