
నవసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
నారాయణపేట టౌన్: నవసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్న 3వ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా డా.నగేశ్‌ను ఆదివారం స్థానిక భగత్‌సింగ్ భవన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో అసమానతలతో కూడిన విద్యా విధానానికి వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జిరెడ్డి స్థాపించిన పీడీఎస్‌యూ 50 ఏళ్లుగా అనేక సమస్యలపై పోరాడుతుందన్నారు. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు అందరికీ కామన్ విద్యా విధానం, శాసీ్త్రయ విద్యా విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో నిర్వహించే జిల్లా మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాలేశ్వర్, బోయిన్‌పల్లి రాము, రామకృష్ణ, శారద, అజయ్, గౌస్, వెంకటేశ్, మహేష్ ఉన్నారు.
దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలి
నారాయణపేట: దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలని హిందూవాహిని తెలంగాణ రాష్ట్ర మంత్రి యాదిరెడ్డి బిజ్వర్ గురూజీ శక్తి పరాశ్రీ పిలుపునిచ్చారు. నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు పద సంచలన్ చేపట్టగా.. ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో యాదిరెడ్డి బిజ్వర్ గురూజీ శక్తి పరాశ్రీ మాట్లాడారు. దేశం, ధర్మం కోసం పాటుపడే వారందరినీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం సేవకుల కృషితో హిందువుల్లో సంఘటిత శక్తి నెలకొంటుందని.. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఊట్కూర్ మండలశాఖ స్వయం సేవకులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో ఆదివారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి జలాశయానికి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచినట్లు వివరించారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూ సెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు.

నవసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం