
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది.
పథకం అమలు ఇలా..
ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు.
● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు.
● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది.
డిపో డీఎం సెల్ నంబర్
మహబూబ్‌నగర్ సుజాత 99592 26286
షాద్‌నగర్ ఉష 99592 26287
నాగర్‌కర్నూల్ యాదయ్య 99592 26288
వనపర్తి దేవేందర్‌గౌడ్ 99592 26289
గద్వాల సునీత 99592 26290
అచ్చంపేట ప్రసాద్ 99592 26291
కల్వకుర్తి సుహాసిని 99592 26292
నారాయణపేట లావణ్య 99592 26293
కొల్లాపూర్ ఉమాశంకర్‌గౌడ్ 90004 05878
వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం
పేదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం
దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు
విభిన్న మార్గాల్లో సంస్థకూసమకూరనున్న ఆదాయం

ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం

ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం