
రైతు సమస్యల పరిష్కారానికి కృషి
కృష్ణా: సన్న రకం ధాన్యానికి అందించే బోనస్ అంశం ఒక్క కృష్ణా, మాగనూర్ మండలంలోనే కాదు ఇది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్య అని, ఈ విషయంపై శనివారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ త్వరగా అందించాలని శుక్రవారం మంత్రిని ఆయన స్వగృహంలో రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఉమ్మడి మాగనూర్,కృష్ణా మండలాలకు చెందిన రైతులు గురువారం దసరా రోజు టైరోడ్డులో సమావేశమై.. తమ సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించారు. ఈ విషయంపై శుక్రవారం రైతులు మంత్రిని కలిశారు. ఈమేరకు మంత్రి మాట్లాడుతూ.. రైతులు ఇలా సమావేశం కావడం, సమస్యలపై ప్రశ్నించడం రైతుల్లో వచ్చిన ఈ చైతన్యం, మార్పు అభినందనీయమన్నారు. ఇక మీదట ప్రతి నెల మార్కెట్ చైర్మన్ అధ్యక్షతనలో మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ అధికారులు, మక్తల్, మాగనూర్,కృష్ణా మండలాలకు చెందిన రైతులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించబోతున్నామని అన్నారు. రైతుల సమస్యలు ఏవైన అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే కృష్ణా మండలంలోని భీమా నదిపై చెక్‌డ్యాంలు నిర్మిస్తామని, అలాగే ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయిస్తానని అన్నారు. అనంతరం మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజప్పగౌడ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొంకల్ వెంకటేష్, నాగేశ్వర్‌రావ్, చెవిటోళ్ల వెంకటేష్,మురహర్‌దోడ్డి శ్రీను,శంక్రప్ప పాల్గొన్నారు.