
గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం
● నూతన ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట/కృష్ణా: జాతిపిత మహాత్మా గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని నూతన ఎస్పీ వినీత్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటీష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ అన్నారు. నేటి యువతరం గాంధీజీ జీవన మార్గాన్ని అనుసరించాలన్నారు. దేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉండాలని సంకల్పించిన గొప్ప మానవతావాది గాంధీజీ అని, అలాంటి గొప్ప నాయకుని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని, కష్టపడే తత్వం అలవర్చుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహ, ఆర్‌ఎస్‌ఐ శ్వేత, పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.
సరిహద్దులో అక్రమ రవాణాను అరికట్టాలి
కృష్ణా: సరిహద్దులో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టు వద్ద పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ వినిత్ ఆదేశించారు. శుక్రవారం సరిహద్దులోని చెక్‌పోస్టుతోపాటు కృష్ణా పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి రోజు వాహనాలను తనిఖీ చేయడంతో పాటూ అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల సరఫరా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మక్తల్ సీఐ రాంలాల్,ఎస్‌ఐ ఎండీ నవీద్,ఏఎస్‌ఐ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ వినీత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇదివరకు కొత్తగూడెం ఎస్పీగా, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తించి బదిలీపై నారాయణపేట జిల్లా ఎస్పీగా వచ్చారు. 2017 (బ్యాచ్) సంవత్సరంలో ఎస్పీగా నియమితులయ్యారు. డీఎస్పి నల్లపు లింగయ్య జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీకి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.