
వరిసాగు జోరు
మరికల్: జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. ఎక్కడా చూసినా వరి నాడుమడులలో కరిగెట్లు చేయడం.. నాట్లు వేయడం వంటి పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమై కనిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. బోరుబావుల్లో భూగర్భజలమట్టం పెరగడంతో రైతులు వరిసాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గతేడాది వానాకాలం 1.60లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఈ ఏడాది 1.70లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే 50శాతం పైగా వరినాట్లు పూర్తయ్యాయి. వరినాట్ల సమయం ముగిసే నాటికి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
కూలీలకు డిమాండ్..
జిల్లాలో 15 రోజులుగా వరిసాగు జోరందుకోవడంతో కూలీల ధరలు అమాంతం పెంచేశారు. రైతులందరూ ఒకేసారి వరినాట్లు వేస్తుండటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర మండలాల నుంచి కూలీలను రప్పిస్తుండగా.. ఎకరా నాట్లు వేసేందుకు రూ. 6వేలు డిమాండ్ చేస్తున్నారు. వారు వచ్చేందుకు రవాణా ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు పెరిగిన పెట్టుబడుల కారణంగా ఎకరా వరిసాగుకు రూ. 30వేల ఖర్చవుతోంది. అయితే సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసే సమయం ఉండటంతో కూలీలు ఎక్కువగా ఇతర వ్యవసాయ పనులకు వెళ్లకుండా వరినాట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
బోనస్‌తో పెరిగిన సాగు విస్తీర్ణం..
సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు. గత యాసంగిలో బోనస్ రాకపోవడంపై రైతులు కొంత నిరాశలో ఉన్నప్పటికీ వరివైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాధార పంటలపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు కూడా తమ పొల్లాలో బోరుడ్రిల్లింగ్ చేసి వరిసాగు చేస్తున్నారు.
జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అంచనా
ఇప్పటికే 50శాతం పైగా నాట్లు
కూలీల కొరతతో రైతుల అవస్థలు
ఎకరాకు రూ. 30వేల వరకుఖర్చవుతుందని ఆందోళన

వరిసాగు జోరు