పాలమూరులో పోకిరీలు | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో పోకిరీలు

Jul 25 2025 8:09 AM | Updated on Jul 25 2025 8:09 AM

పాలమూరులో పోకిరీలు

పాలమూరులో పోకిరీలు

ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు

అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, ఈవ్‌ టీజింగ్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్‌ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం.

– జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్‌

అండగా సఖి కేంద్రం..

వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్‌ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్‌ఫ్రీ నం.181కు ఫోన్‌ చేసి సమస్యను చెప్పవచ్చు.

– సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్‌,

మహబూబ్‌నగర్‌

బాలికలకు అండగా..

● చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, డయల్‌ 100 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

● షీటీంకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59365, భరోసాకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59280

● భరోసా సెంటర్‌లో మైనర్లకు రక్షణతోపాటు న్యాయం అందుతుంది.

● మహిళా, శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సహాయం పొందవచ్చు.

● లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం–2012 (పోక్సో) కఠిన శిక్షలు పడేలా చేస్తోంది.

● సఖి సెంటర్‌ ద్వారా అన్యాయానికి గురైన చిన్నారులు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి, రక్షణతో,పాటు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లా షీటీం విభాగానికి నెల రోజుల్లో 27 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇవ్వగా.. 25 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

‘మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని

ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.’

మహమ్మదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్‌ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో మైనర్‌ అబ్బాయిలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్‌లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్‌ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొందరు యువకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 451, నాగర్‌కర్నూల్‌లో 327, గద్వాలలో 234, నారాయణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి.

నిత్యం తనిఖీలు చేస్తే..

మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి.

చిన్నప్పటి నుంచే..

● లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.

● వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి.

● ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి.

● శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

● ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి.

2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు

నమోదైన కేసులు

2022 2023 2024 2025

(జూన్‌)

మహబూబ్‌నగర్‌ 133 116 133 69

వనపర్తి 47 46 54 42

జోగుళాంబ గద్వాల 74 73 51 36

నాగర్‌కర్నూల్‌ 86 91 105 45

నారాయణపేట 50 42 80 39

జిల్లా

ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు

కీచకులుగా మారుతున్న

పలువురు ఉపాధ్యాయులు

పాఠశాలల్లోనూ విద్యార్థినులపై

లైంగిక దాడులు

నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement