
విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట రూరల్: జిల్లాలో విద్య, వైద్యరంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నజట్రం ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. బోధన సమయంలో టీఎల్‌ఎం ఉపయోగించాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉండాలన్నారు. టీబీ నివారణపై కార్యాచరణ పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.