
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థినులు
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డెక్కారు. శుక్రవారం తరగతులను బహిష్కరించి కిష్టాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విద్యార్థినుల ఆందోళనకు ధర్మసమాజ్ పార్టీ, పీడీఎస్‌యూ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. స్థానిక కేజీబీవీ పరిధిలోని టైప్–4 బాలికల హాస్టల్‌లో వసతి పొందుతున్న మోడల్ స్కూల్ విద్యార్థినులు మౌలిక సదుపాయాల లేమితో అవస్థలు పడుతున్నారన్నారు. వసతిగృహాలు దయనీయ స్థితిలో ఉన్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేజీబీవీ ఎస్‌ఓ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మధ్య సమన్వయం లేకపోవడం మరిన్ని సమస్యలకు కారణమని ఆరోపించారు. అయితే ఆందోళన సమాచారం అందుకున్న డీఈఓ గోవిందరాజులు, జీసీడీఓ నర్మద విద్యార్థినుల వద్దకు చేరుకొని నచ్చజెప్పారు. మోడల్ స్కూల్ హాస్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతోఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే, మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురికావడం.. రోడ్డెక్కి ఆందోళన చేపట్టడంపై కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై డీఈఓతో ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే కేజీబీవీ ఎస్‌ఓ గంగమ్మ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాయి ఆశ్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మోడల్ స్కూల్ హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్