కల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ఈనెల 5 నుంచి 14వ తేదీ (బాబు జగ్జీవన్ రామ్ జయంతి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి) వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ అన్నారు. ఆదివారం కల్లూరు మండలం ఎ.గోకులపాడులో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూర్య ఘర్ పథకం, రాష్ట్ర ప్రభుత్వ యూఎల్‌ఏ మోడల్ ద్వారా పెద్ద ఎత్తున సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 23,077 గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కిట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శుభకార్యానికి వచ్చి..
మృత్యుఒడికి..
● కుందూనదిలో జారిపడి పదేళ్ల బాలిక మృతి
బండిఆత్మకూరు: బంధువుల శుభాకార్యానికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ మృత్యుఒడి చేరింది. నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాల గ్రామానికి చెందిన షేక్ సుభాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పార్నపల్లి గ్రామంలో జరిగే బంధువుల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. సరదాగా గడుపుతున్న సమయంలో సుభాన్‌బాషా కుమార్తె షబానా (10) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
మహానంది: ఎండలను దృష్టిలో ఉంచుకుని మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానంలోని రాజగోపురం ముందు భాగంతో పాటు ఆలయంలో ఉన్న క్యూలైన్లు, కోనేరు ప్రాంతాలు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, తదితర ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, కొబ్బరిపీచు మ్యాట్లను వేయించారు. ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది ఆదివారం ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వం ఉపాధ్యాయు ల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామపక్కీర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్ రద్దుకు కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు.


