నంద్యాల: దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాన్ని ముందుగా వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సమాజానికి మార్గదర్శకమన్నారు. సమాజంలో కార్మిక చట్టాల ప్రాముఖ్యతను వివరిస్తూ, చట్టాల సహాయంతో సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, దీనికి బాబూజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, ఏ. చిన్న వెంకట సుబ్బయ్య, దండు వీరయ్య, ఎన్. లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


