 
															‘అంతస్తులు’ దాటిన అవినీతిపై ఇంటెలిజెన్స్ ఆరా
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగిపై ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆదివారం సాక్షి దినపత్రికలో ‘అంతస్తులు’దాటిన అవినీతి అనే శీర్షికతో దేవస్థానంలో ఓ అధికారి అవినీతిపై కథనం ప్రచురితమైంది. ఈ కథనం గురించి శ్రీశైల దేవస్థానం అధికారుల్లో, స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు సదరు అధికారి నివాసం ఉంటున్న రెవెన్యూ పట్టా ఎవరి పేరుతో ఉంది? ప్రస్తుతం ఆ పట్టా భూమిలో ఎన్ని అంతస్తుల ఇల్లు నిర్మించారు? ఆ గృహానికి విద్యుత్‌మీటర్లు ఎవరి పేరుతో ఉన్నాయి? అని ఆరా తీసినట్లు సమాచారం. విద్యుత్ మీటర్ ఇవ్వాలంటే పట్టా భూమి ఎవరి పేరుతో ఉంటే వారి పేరుతో ఇస్తారు. అలాగే దేవస్థానం స్థలంలో అయితే దేవస్థానం అధికారులు ఎన్‌వోసీ ఇస్తేనే విద్యుత్ మీటర్లు ఇస్తారు. కానీ ఆ అధికారి సతీమణి పేరుతో విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాక ‘సాక్షి’ కథనంపై దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు సైతం అధికారుల ద్వారా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అరుణాచలం, పంచారామాలు క్షేత్రాలకు నంద్యాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవీలత ఆదివారం తెలిపారు. వచ్చే నెల పౌర్ణమి నాలుగో తేదీ ఉదయాన ఏడు గంటలకు అరుణాచలానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ చార్జీతో కలిపి రూ.1750 అవుతుందన్నారు. అదేవిధంగా పంచారామా ఆలయాలైనా అమరావతిలోనే అమరరామం, భీమవరంలోని సోమేశ్వర రామం, పాలకొల్లులోని క్షీరరామం,, ద్రాక్షారామంలోని భీమేశ్వర రామం, సామర్లకోటలోని కొమరామం క్షేత్రాల దర్శనం దర్శనానికి నంద్యాల ఆర్టీసీ డిపో నుండి నవంబర్ ఒకటో తేదీ 4, 7, 8, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. రానుపోను చార్జీతో కలిపి ఒక్కొక్కరికి రూ.2,500 అవుతుందన్నారు. మరిన్ని వివరాలకు 95050 65651, 9959225800ను సంప్రదించలన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
