 
															మోంథా తుపాను పట్ల అప్రమత్తం
27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక
నంద్యాల: మోంథా తుపాను నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్‌ఓ రాము నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపాను చైన్నె తీరం వైపు నుంచి విశాఖపట్నం దిశగా గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదుర గాలులతో కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అందువల్ల అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో సుమారు 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 200 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని, వీటి బండ్‌లను బలపరచాలని సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని విభాగాల అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08514–293903 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్:
08514–293903
జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
