సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట | - | Sakshi
Sakshi News home page

సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట

Oct 24 2025 2:44 AM | Updated on Oct 24 2025 2:44 AM

సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట

సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, పండిన పంటలకు మద్దతు ధరలు లేక పోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోయారు. మరో వైపు ఉన్న ఊరిలో ఉపాధి కరువై ప్రజలు వలస బాట పట్టారు. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. గత నెలలో కురిసిన అధిక వర్షాల వల్ల పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేటికీ మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్‌ పూర్తి కాలేదు. ఈ సీజన్‌లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించిన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదును జమ చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డెక్కిన టమాట రైతు..

జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో అధికంగా పండించే టమాట ఈ ఏడాది రైతు కంట కన్నీరు తెప్పించింది. దాదాపు 13,500 ఎకరాల్లో సాగు చేసిన టమాటకు ఈ ఏడాది ధర లేకపోవడం వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకానొక సందర్భంలో కిలో టమోటా ధర 10 పైసలు కూడా పలకకపోవడం వల్ల రైతులు తాము పండించిన టమోటాను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆదుకుంటామంటూ పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

శనగ విత్తనాలు కరువు

ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 వేల క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా కూడా శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ పల్లెలు ఖాళీ..

జిల్లాలో పనులు లేక, పస్తులుండలేక పశ్చిమ పల్లెలు వలస బాట పడుతున్నాయి. ఉన్న కొద్ది భూముల్లో వేసిన పంటలు వివిధ కారణాల వల్ల చేతికి రాకపోవడం, వచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా గ్రామాలను వదిలి కూలీ పనులు చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లోని ఆనేక గ్రామాల ప్రజలు హైదరాబాద్‌, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వలసలను నివారించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా కూలి అంతంత మాత్రంగానే ఇస్తుండడం వల్ల కూలీలు వలస పోతున్నారు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు ( సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్‌పిట్స్‌ ) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

అసెంబ్లీలో ప్రస్తావించినా..

‘ఆదోని నియోజకవర్గంలో ఏ పల్లైకె నా వెళ్లండి అధ్యక్షా ... అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి, 2.62 లక్షల మంది ఓటర్లు ఉన్న ఆదోని నియోజకవర్గంలో లక్ష మంది వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. సాగు, తాగు నీటికి ఇబ్బందే, పరిశ్రమలు లేవు ... ఇవన్ని మంత్రికి తెలుసా’ అని అసెంబ్లీలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యే డా.పార్థసారథి ప్రశ్నించారు. ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే లక్ష మంది పనుల్లేక వలసలు వెళ్లారని ఎమ్మెల్యే డా.పార్థసారథి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించినా, నేటికి ప్రభుత్వం వలసలను నివారించే చర్యలను చేపట్టలేదు.

వర్షాలతో కుదేలైన రైతాంగం

నత్తనడకన పంట నష్ట పరిహారం

ఎన్యుమరేషన్‌

ఉల్లి రైతుకు ప్రభుత్వం

రూ.16.50 కోట్ల బకాయి

అవసరానికి అందని శనగ విత్తనాలు

వలసలతో ఖాళీ అయిన

పశ్చిమ పల్లెలు

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ...

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 24వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మత్స్య శాఖ, దేవదాయ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement