 
															‘కూటమి’ కుట్రకు అధికారుల సహకారం
ఆదోని రూరల్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ కుట్రకు అధికారుల సహకారం అందించి ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ అన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఆదోనిలోని ఎంపీడీఓ కార్యాలయానికి గురువారం వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మినిట్స్ బుక్‌లో పేర్కొన్న తీర్మాన పత్రాన్ని ఇవ్వాలని బుధవారమే వైస్ ఎంపీపీ నరేంద్రరెడ్డి, ఇతర ఎంపీటీసీలు కోరగా ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీఓ జనార్దన్‌ను ప్రశ్నించారు. అందుకు ఎంపీడీఓ జనార్ధన్ మాట్లాడుతూ.. ‘అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నా పరిధిలో లేదని, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ పరిధిలో ఉందని, అందుచేత ఆయనే తీర్మాన మినిట్స్ అందించాల్సి ఉంది’ అన్నారు. వెంటనే సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ‘అందుబాటులో లేనని, రేపు కూడా అందుబాటులో ఉండనని, శనివారం వచ్చి అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలను’ అని సబ్ కలెక్టర్ తెలిపారు.
చట్ట విరుద్ధంగా..
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ.. బుధవారం జరిగిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై ఎంతటి న్యాయ పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 29 మంది ఎంపీటీసీ స్థానాలను పరిగణనలోకి తీసుకుని కోరం ప్రకారం 19 మంది ఉండాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 26 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా, అందులో ఇద్దరు ఎంపీటీసీలు మృతిచెందగా, ఒకరు రాజీనామా చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న 23 మంది ఎంపీటీసీలను పరిగణనలోకి తీసుకుని అవిశ్వాస తీర్మానం ఎన్నిక జరిపి ఉంటే 15 మంది ఎంపీటీసీలు ఉంటే నెగ్గేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీలు హాజరైతే అధికారులు కూటమి ప్రభుత్వ కుట్రకు కొమ్ము కాసి వీగిపోయేలా చేశారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, న్యాయవాది జీవన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని
వీగిపోయేలా చేశారు
న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి,
ఎమ్మెల్సీ మధుసూదన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
