● నివారణ చర్యలు చేపట్టండి
నంద్యాల(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ కింద సాగు చేసిన పత్తి పంటను గులాబీ రంగు పురుగు ఆశించినట్లు ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్, పత్తి విభాగ కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణలు తెలిపారు. భీమవరం సమీపంలో సాగు అయిన పత్తి పంటను గురువారం డాక్టర్ శివరామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. పత్తి పంట సాగు అయి నేటికి 140 రోజులు అయ్యిందన్నారు. కాయ, పక్వ దశ నుంచి పత్తి తీత దశలో ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఆధారంగా పత్తి పైరును గులాబీ పురుగు ఆశించిందన్నారు. పురుగు ఉద్ధృతి రాబోయే మూడు నెలల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్ధృతి అక్టోబర్ నెలలోనే ఆర్థిక నష్ట పరిమితి దాటినట్లు గుర్తించామన్నారు. రైతులు రాబోవు మూడు నెలల్లో తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవాలన్నారు. ముందుగా ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉద్ధృతిని గుర్తించాలన్నారు. ప్రతి బుట్టలో వరుసగా మూడు రోజులు 8–10 పురుగులు పడిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు సామూహిక నిర్మూలనకు ఎకరాకు 10–15 లింగాకర్షణ బుట్టలు ఉంచాలని, పురుగు ఆర్థిక నష్ట పరిమితి (ప్రతి బుట్టలో 8–10 పురుగులు మూడు రోజులు వరుసగా పడిన) దాటిన వెంటనే వేపనూనె 1500 పీపీఎం, 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పదిరోజుల వ్యవధిలో వరుసగా ప్రొఫొనోపాస్, 20మి.లీ క్లోరో పైరీపాస్, 2.5మి.లీ పైరీడా లిల్, 1.5మి.లీ లీటరు నీటితో కలిపి మార్చిమార్చి పిచికారీ చేయాలన్నారు. పంట ఆఖరి దశలో బైఫ్రెన్‌త్రిన్, 2.0మి.లీ, పెంప్రోపత్రిన్, 2.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను జనవరి నెల తర్వాత పొడిగించకూడదన్నారు.
‘గులాబీ’ పురుగు మరింత ఉద్ధృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
