
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాలైన హెలిపాడ్, సున్నిపెంట నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం, భ్రమరాంబా అతిథిగృహం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని ఈ నెల 16న శ్రీశైలం చేరుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోనున్నారని, ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం, సున్నిపెంట సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు ఉన్నారు.