
రికార్డుల అస్తవ్యస్తంపై కేంద్ర బృందం అసంతృప్తి
జూపాడుబంగ్లా: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, గ్రామ పంచాయతీ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంతో కేంద్రబృందం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని పారుమంచాల గ్రామంలో కేంద్రబృందం టీం లీడర్ సంతోష్‌కుమార్, టీం మెంబర్ సూర్యకాంతప్రదాన్ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంతోష్‌కుమార్ ఉపాధిహామీ పథకం, పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. 2025–26 ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్‌లను చూపించాలని ఏపీఓలు గౌరీబాయి, రేష్మలను అడగ్గా వారు రికార్డులు చూపించకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంత మంజూరయ్యాయి, వాటికి ఏఏ అభివృద్ధిపనులకు వెచ్చించారు, వాటికి సంబంధించిన రికార్డులు చూపించాలని పంచాయతీ కార్యదర్శి శాలుబాషాను ప్రశ్నించగా ఆయన రికార్డులు చూపించకపోవటంతో ఆయనపై కేంద్రబృందం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకం సోషల్‌ఆడిట్‌కు సంబంధించి గ్రామసభలో నిర్వహించిన సమావేశ తీర్మానంలో కేవలం 9 మంది సంతకాలు మాత్రమే ఉండటంతో గ్రామసభలు నిర్వహించటం కూడా రాదా.. అంటూ మండిపడ్డారు. అనంతరం కేంద్రం నిధులతో చేపట్టిన ఉపాధిపనులు, గోకులంషెడ్ల నిర్మాణం పనులను కేంద్రబృందం సభ్యులు పరిశీలించారు. వీరి వెంట ఎంపీడీఓ గోపికృష్ణ, ఏపీడీ అన్వరాబేగం, లైజనింగ్ అధికారి దాసు, సర్పంచ్ ప్రకాశం, ఏఈలు బషీర్, నాగేంద్ర, ఏపీఓ లు గౌరీబాయి, రేష్మ, ఏపీఎం అంబమ్మ తదితరులు పాల్గొన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధుల రికార్డులు
చూపించని పీఎస్‌పై అసహనం
లేబర్ బడ్జెట్ తయారు చేయకుండా
ఉపాధి పనులా ?