
స్టేషన్లలోనే న్యాయం చేయాలి
కర్నూలు: పోలీస్‌స్టేషన్లలో న్యాయం జరిగితే బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించే అవకాశం ఉండదని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సీరియస్‌గా పనిచేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండదని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో సాంకేతికతను వినియోగించి నేర నియంత్రణకు గట్టిగా పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను డీఐజీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్త పెండింగ్ కేసులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు బాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, యాంటీ ఈవ్ టీజింగ్ తనిఖీలతో పాటు డ్రోన్ కెమెరాలతో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలన్నారు. ఆయా కేసులలో నిందితుల వేలి ముద్రలను సేకరించి కేసులను ఛేదించాలన్నారు. గత ఆరు నెలలుగా చోటు చేసుకున్న నేరాల విశ్లేషణ, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, హేమలత, ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.

స్టేషన్లలోనే న్యాయం చేయాలి