అవినీతి రయ్‌.. రయ్‌..! | - | Sakshi
Sakshi News home page

అవినీతి రయ్‌.. రయ్‌..!

Jul 16 2025 4:15 AM | Updated on Jul 16 2025 4:15 AM

అవినీతి రయ్‌.. రయ్‌..!

అవినీతి రయ్‌.. రయ్‌..!

● అక్రమ రవాణా, ఓవర్‌ లోడ్‌ వాహనాలపై నిఘా పెట్టి వసూళ్లు ● ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్న అధికారులు ● అడిగినంత ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరింపు ● నమ్మకస్తులైన లారీ ఓనర్లతో వసూళ్లకు ప్రత్యేక వ్యవస్థ

కర్నూలు: వాహన సామర్థ్య పరీక్షల (ఎఫ్‌సీ) సర్టిఫికెట్ల జారీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ కోసం ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఆయా సేవల నుంచి వచ్చే మామూళ్లు నిలిచిపోయాయి. దీంతో రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేరుతో నిత్యం రోడ్లపై తిష్ట వేసి నయా దందాకు తెర లేపారు. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కర్నూలు మీదుగా వాహనాలు వెళ్తుంటాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ మార్గంలో గంటకు వెయ్యికి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సరుకు రవాణా చేసే వాహనాలకు సంబంధించి వే బిల్లులు, అంతర్రాష్ట్ర పర్మిట్లు, ఇతర అనుమతుల పేరుతో అధికారులు ప్రతిరోజూ తనిఖీలు చేస్తుంటారు. అక్రమ రవాణా, ఓవర్‌ లోడ్‌తో వెళ్తుంటే సదరు వాహనాలకు జరిమానా విధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జరిమానాలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరగాలి. భౌతికంగా ఒక్క రూపాయి వసూలు చేసేందుకు వీలు లేదు. అయితే వాహనంలో ఉన్న సరుకు, సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లారీ నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా అక్రమ రవాణా, ఓవర్‌ లోడ్‌ వాహనాల ద్వారా వసూలవుతున్నట్లు ఆ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు చర్చించుకుంటున్నారు.

5వ తేదీలోపే మామూళ్లు

ఎర్రమట్టి, ఇసుక, కంకర, గ్రానైట్‌ తరలించే లారీలు, టిప్పర్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం చైన్నె – సూరత్‌ హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులకు ఇసుక, ఎర్రమట్టిని టిప్పర్లలో సామర్థ్యానికి మించి తరలిస్తుండటంతో వారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. క్రిష్ణగిరి, తాడిపత్రి, బేతంచెర్ల, డోన్‌ ప్రాంతాల నుంచి కర్నూలు మీదుగా ఇతర ప్రాంతాలకు గ్రానైట్‌, చిప్స్‌, బండలు, సిమెంటు, మైనింగ్‌ మెటీరియల్‌, పౌడర్‌ వంటివి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. వాటిపై కూడా నిఘా వేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 400కు పైగా వాహనాల నుంచి నెలకు ఒక్కో వాహనానికి రూ.8 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా 5వ తేదీలోపు ఆయా ప్రాంతాల్లోని నమ్మకస్తులైన లారీ యజమానులు మామూళ్లు వసూలు చేసి అధికారులకు ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలులోని ఓ ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకుని మామూళ్లు దండుకుంటున్నట్లు సమాచారం. గొర్రెలు, బర్రెలు తరలించే లారీలు కూడా మామూళ్లు ఇవ్వాల్సిందే. ఔటర్‌ రింగ్‌రోడ్డు, వెంగన్న బావి, నన్నూరు టోల్‌ ప్లాజా ప్రాంతాల్లో తిష్ట వేసి మామూళ్లు వసూలు చేస్తున్నారు. అలాగే కోడుమూరు రోడ్డులో తిష్ట వేసి ఈర్లదిన్నె ప్రాంతం నుంచి వచ్చే ఇసుక లారీల నుంచి, నాగలూటి నుంచి కర్నూలుకు నాపరాయి రవాణా చేసే ట్రాక్టర్ల నుంచి మామూళ్లు దండుకుంటున్నారు. ఇలా నెలకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వసూలు చేసి, కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు వాటాలు వేసి పంచుకుంటున్నట్లు ఆ శాఖలోని కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

చేతికి అంటకుండా..

హైదరాబాదు – బెంగళూరు 44వ నంబర్‌ జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అధిక సామర్థ్యంతో వెళ్తుంటాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేరుతో రోడ్లపై తిష్ట వేసి అక్రమ, ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధించి తర్వాత బేరం కుదుర్చుకోవడం లేదా కేసుల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కర్ణాటక నుంచి కర్నూలు మీదుగా మరో ప్రాంతానికి బొగ్గుల లారీ ఓవర్‌ లోడ్‌తో వెళ్తోంది. టోల్‌గేట్‌ వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి కేసు రాస్తే రూ.50 వేలు అవుతుంది. అందులో సగం ఇస్తే వదిలేస్తామంటూ బేరం కుదుర్చుకుని వదిలేశారు.

తెలంగాణ వైపు నుంచి 62.5 టన్నుల గ్రానైట్‌ లోడుతో వస్తున్న ఓ లారీని రవాణా శాఖ అధికారులు కర్నూలు శివారులో ఆపారు. 35 టన్నులతో వెళ్లాల్సిన లారీలో 27.50 టన్నులు అదనంగా ఉన్నందున రూ.73 వేలు జరిమానా విధించాలి. అయితే రూ.15 వేలు తీసుకుని లారీని వదిలేశారు.

తమ చేతికి మట్టి అంటకుండా నమ్మకస్తులైన ఆర్‌టీఏ ఏజెంట్లు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ నంబర్లు ఇచ్చి ఫోన్‌పే ద్వారా మామూళ్లు ముట్టిన తర్వాతనే వాహనదారులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాహన రికార్డులు సక్రమంగా లేవనో, లోడ్‌ ఎక్కువగా ఉందనో, పర్మిట్‌ లేదనో? ఇలా ఏదో ఒక సాకు చూపి అడిగినంత ఇచ్చిన తర్వాత కానీ వాహనం ముందుకు కదలనివ్వరు. అక్రమ వసూళ్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రోజుకు కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గండి పడుతున్నట్లు సమాచారం. రవాణా శాఖ అధికారుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్‌కు జిల్లా నుంచి తరచూ ఫిర్యాదులు వెళ్తున్నట్లు సమాచారం.

రవాణా శాఖకు అన్నిటికంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కీలకం. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగే వాహనాలను తనిఖీ చేసే అధికారం వీరికి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement