
● మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని దారుణం
ఇష్టం లేని పెళ్లి నిశ్చయించారని బలవన్మరణం
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో మానస (20) అనే యువతి ఇష్టం లేకుండా వివాహం నిశ్చయించారని మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వరలక్ష్మి కూతురు మానస ఇంటర్మీడియెట్ వరకు చదువుకుంది. తండ్రి మల్లయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నారు. పెద్ద కూతురు మానసకు ఇటీవల వివాహం నిశ్చయించారు. నెల రోజుల్లో వివాహం చేసేందుకు తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని మానస మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తాతను చంపిన మనుమడు
బనగానపల్లె: పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం మధ్యహ్నం దారుణం చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణానికి చెందిన షేక్ కోట్ల ఉశేన్ సా (75) పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోవడంతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమై ఉన్నాడు. ఈ స్థితిలో మంగళవారం అతని మనుమడు షేక్ ఉశేన్ బాషా మద్యం మత్తులో తాతను డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లేడ్‌తో తల, గొంతు ఇతర శరీర భాగాలపై కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి కుమార్తె షేకున్ బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు.
వ్యక్తి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లకు చెందిన పసుపుల వెంకటేశ్వర్లు (55) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశ్వర్లు లోడింగ్ కార్మికుడిగా పని చేస్తుండేవాడు. తరచూ మద్యం సేవిస్తూ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది పేడ రంగు నీటిలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.