● మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావంటూ బెదిరించి రూ.15 వేలు కాజేత
ఆదోని అర్బన్: మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.15,625 కాజేశారు. వివరాలు.. ఆదోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బాబు రాజేంద్రప్రసాద్ కుటుంబం నివాసం ఉంటోంది. మంగళవారం రాజేంద్రప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఫోన్‌కాల్ రాగా ఆయన కుమారుడు సాయికృష్ణ లిఫ్ట్ చేశారు. అవతలివైపు వారు మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 2024 మార్చిలో అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని చెప్పి బెదిరించారు. కేసు నకిలీ పత్రాలు, రాజేంద్రప్రసాద్ డెబిట్ కార్డు ఫొటోను వాట్సాప్‌లో పంపి భయబ్రాంతులకు గురి చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేస్తామని, అలా గాకుండా ఉండాలంటే రూ.15625 ఫీజు మొత్తాన్ని ఫోన్‌పే చేయాలని హెచ్చరించారు. సాయిక్రిష్ణ భయాందోళనతో వణికిపోతూ ఫోన్ మాట్లాడుతుండగా ఇంట్లోకి వచ్చిన తండ్రి జరిగిన విషయం తెలుసుకున్నారు. కుమారుడి భయాన్ని చూసి ఒత్తిడితో దుండగులు చెప్పిన నంబర్‌కు రూ.15,625 ఫోన్‌పే చేశారు. తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన రాజేంద్రప్రసాద్ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
సైబర్ వలలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి