
ఎంత కష్టం.. ఎంత నష్టం
నందికొట్కూరు/కొత్తపల్లి: కోటి ఆశలతో ఖరీఫ్‌ను ప్రారంభించిన రైతుల ఆశలు ఎండిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయే తప్ప వర్షం జాడలేదు. 20 రోజులుగా వానల్లేక పంటలు ఎండిపోతున్నాయి. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా పొలాలు తడవని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వరి 15,910 హెక్టార్లలో, మొక్కజొన్న 38,749, కంది 26,990, వేరుశనగ 9,240, పత్తి 24,951, ఉల్లి 3,008, మిరప 5,972, కొర్ర 1,099, సన్‌ప్లవర్ 397, పెసరపప్పు 136, పసుపు 526 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. తొలకరి వర్షాలకు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుము, సోయాబీన్స్, పెసర, కంది తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఎండుతున్న పంటలను రైతులు విధిలేని పరిస్థితుల్లో తొలగించారు. కూత వేటు దూరంలో పుష్కలంగా కృష్ణమ్మ ప్రవహిస్తున్నా రైతుల పొలాలు తడవని పరిస్థితి నెలకొంది. ముసలమడుగు గ్రామ సమీపంలో ఉన్న శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలకు నీరు పుష్కలంగా ఉన్నా ఎత్తిపోయడంలో జాప్యం జరుగుతోంది. పంటలు ఎండిపోతున్నా అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండుతున్న పంటలను కాపాడుకోలేక రైతులు తొలగిస్తున్నారు. పెట్టుబడి మట్టిపాలు కావడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
20 రోజులుగా జాడ లేని వరుణుడు
ఎండుతున్న పంటలు
పని చేయని ఎత్తిపోతలు
పంటలను తొలగిస్తున్న రైతులు

ఎంత కష్టం.. ఎంత నష్టం