
వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో లక్ష కుంకుమార్చన
శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబాదేవికి గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్రనామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్షసేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పరోక్షసేవలో పాల్గొన్నారు.
ముద్దచర్మ వ్యాధి నివారణకు నేటి నుంచి టీకాలు
కర్నూలు(అగ్రికల్చర్): ముద్ద చర్మవ్యాధి( లంపిస్కిన్ డిసీజ్) నివారణకు శుక్రవారం నుంచి ఈ నెల చివరి వరకు టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆవులు, గేదెల్లో ముద్ద చర్మ వ్యాధి ప్రధానంగా కనిపిస్తుందన్నారు. వ్యాధితో పశువులు మరణించే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధని ఆయన పేర్కొన్నారు. ముద్దచర్మ వ్యాధి నివారణ కోసం కర్నూలు జిల్లాకు 2,19,100, నంద్యాల జిల్లాకు 95,600 డోసుల వ్యాక్సిన్ వచ్చిందని, అన్ని వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.
అప్పీలుకు అవకాశం ఉండదు
కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులకు అప్పీలు అవకాశం ఉండదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం న్యాయ సదన్‌లో మధ్యవర్తిత్వంపై వారం రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో మొదటి రోజు బ్యాంకు, చిట్‌ఫండ్, ఇన్సూరెన్స్ విభాగాల మేనేజర్లకు మధ్యవర్తిత్వం కేసులను త్వరగా ఎలా పరిష్కరించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు ఉమాదేవి, ఆశాభాయ్ హాజరైన వివిధ సంస్థల మేనేజర్లకు అవగాహన కల్పించారు.
ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర రిజర్వాయర్ నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం ఉదయం 9 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. టీబీ బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణనాయక్, ఎల్లెల్సీ ఈఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో జిల్లా సరిహద్దులోని ఎల్లెల్సీకి చేరనున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది టీబీ డ్యాం నుంచి ఒక పంట (ఖరీఫ్)కు మాత్రమే నీరు ఇవ్వనున్నారు. టీబీ డ్యాం గేట్లు మార్చాలని నిపుణులు సూచనలు చేయడంతో ఈ నిర్ణయించారు. జలాశయంలో 80 టీఎంసీల వరకు మాత్రమే నిల్వ చేసి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. డిసెంబర్ నెలలో కొత్త గేట్లను బిగించేందుకు పనులు మొదలు పెడ్తారు. జిల్లాలో ఎల్లెల్సీ కింద ఖరీఫ్‌లో 43 వేలు, రబీలో లక్షా 7 వేల ఎకరాలకు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది.

వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ