
‘పోతిరెడ్డిపాడు’ నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,86,079 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 882 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 881 అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్‌రెగ్యులేటర్ 2,4,5,6 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు.
నేడు పీఏసీఎస్‌ల సీఈఓలకు అవగాహన సదస్సు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలు, సిబ్బందికి ఈ నెల 9న బనవాసిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పీఏసీఎస్‌ల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. అదే విధంగా సహకార సంఘాల బలోపేతంపై కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సుల్లో బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాఘవేంద్ర కూడా పాల్గొంటారన్నారు.
సమ్మెకు బ్యాంకుల మద్దతు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 9న జరిగే సార్వ త్రిక సమ్మెలో బ్యాంకులు కూడా పాల్గొననున్నా యి. ఏఐబీఈఏ, ఏఐబివోఏ, బీఈఎఫ్‌ఐ, ఎల్‌ఐ సీ,జిఐసీ ట్రేడ్ యూనియన్‌లు బ్యాంకులు, బీమా కంపెనీల సమ్మెకు పిలుపు నిచ్చాయి. అయితే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కో–ఆపరేటివ్ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.కొన్ని కార్పొరేట్ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకులు కూడా సేవలు అందించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సహా మిగిలిన బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇతర బీమా కంపెనీలు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాయని యుఫ్ బీయు జిల్లా కన్వీనర్ ఇ.నాగరాజు తెలిపారు.