
బడి బ్యాగ్ చిరిగిపోతుంది!
శిరివెళ్ల: సర్వేపల్లి రాధా కృష్ణ విద్యా కిట్టు కింద కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం 25 కేజీల పుస్తకాల బరువును కూడా తాళలేకపోతున్నా యని వాపోతున్నారు. పాఠశాలలో బ్యాగులు పంపిణీ చేసి నెల తిరగక ముందే వాటి లాడలు తెగిపోవడం, కుట్లు ఊడిపోవడంతో టైలర్లను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన చాంద్‌బాషా మనుమళ్లు అస్లాం, అక్రంలు ఉర్దూ బాలుర ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వారికిచ్చిన బ్యాగ్‌లు కుట్లు ఊడిపోవడంతో బడికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, టైలర్ వద్ద కుట్టించిన తర్వాత తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. ఏడాదంతా నాసిరకం బ్యాగులతో విద్యార్థులు ఎలా చదువులు సాగించాలని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.