
కౌలు రైతులకు విరివిగా రుణాలు
కర్నూలు(సెంట్రల్): కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..గతేడాది హౌసింగ్, విద్యకు లోన్లను ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ ఏడాది రుణాల మంజూరులో మరింత చొరవ చూపాలన్నారు. గతేడాది నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలను అందజేశారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
రెన్యువల్ ఎనర్జీ కేంద్రంగా కర్నూలు
రానున్నకాలంలో కర్నూలు జిల్లా పునరుత్పాదకశక్తికి(రెన్యువల్ ఎనర్జీ)కేంద్రంగా మారునుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓర్వకల్‌లో 1000 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్టు, గ్రీన్‌కో ద్వారా 1,680 మెగా వాట్లా సామార్థ్యంతో పంప్డ్ స్టోరేజే హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో ఆలూరు, ఆస్పరి, పత్తికొండ ప్రాంతాల్లో పలుసోలార్, విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు అవుతుండడంతో రుణాలు ఇవ్వాలని సూచించారు.
డ్రోన్‌ల మంజూరు వేగవంతంచేయాలి
● ఎస్‌ఎల్‌బీసీ నిబంధనల మేరకు డ్రోన్‌ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
● పీఎం సూర్య ఘర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే రుణాలు ఇవ్వాలన్నారు.
● స్టాండ్ అఫ్ ఇండియా, పీఎం విశ్వకర్మయోజన రుణాల లక్ష్యాలను సాధించాలని సూచించారు.
● మత్స్యశాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.
● రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ శిక్షణ కేంద్రం ద్వారా 35 మంది 4 వీలర్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
పేదల కోసం ‘సోషల్’ నిధి
పేదల కోసం జిల్లాలోఉన్న అన్ని బ్యాంకులు కలసి కొంత మొత్తంతో సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ)నిధిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని బ్యాంకుల నుంచి సీఎస్‌ఆర్ కింద కొంత మొత్తాన్ని జమ చేసి లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్నారు. ఆ మొత్తం మీద వచ్చేవడ్డీతో నిజంగా డబ్బు అవసరం ఉన్నటువంటి రైతులు, పేదలకు సాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు ఉండాలని ఎల్‌డీఎం రామచంద్రరావును జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.17,402.86 కోట్లు
2025–26 వార్షికరుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది లక్ష్యంరూ.17402.86 కోట్లు అని, ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 15.49 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.
మొత్తం వ్యవసాయరుణాలు రూ.6162.06 కోట్లు కాగా, అందులో ఖరీఫ్ వ్యవసాయ రుణాలు రూ.3635.62 కోట్లు, రబీ వ్యవసాయ రుణాలురూ.2526.44కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలుకు రూ,39.24 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలపాలకు రూ.560.38కోట్లు కేటాయించినట్లు చెప్పారు.మొత్తంగా వ్యవసాయరంగానికి రుణ లక్ష్యంరూ.8964.22 కోట్లు అని, ఇది మొత్తం రుణ లక్ష్యంలో 51.51 శాతంగా ఉన్నట్లు చెప్పారు.
మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.3570.63 కోట్లు, విద్యారుణాలు కోసం రూ.80.26 కోట్లు, హౌసింగ్ రుణాలు రూ.200.81 కోట్లు,పునరుత్పాదక శక్తి రూ.94.33కోట్లు, ఇతర రంగాల రుణాల క్ష్యం రూ.13601.72 కోట్ల రుణ లక్ష్యాన్ని కేటాయించినట్లు వివరించారు.
కార్యక్రమంలో కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంత్‌కుమార్, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, మెప్మా పీడీ నాగశివలీల, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం
రూ.17,402.86 కోట్లు
జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో
కలెక్టర్ పి.రంజిత్‌బాషా