శ్రీగిరి.. భక్తజన ఝరి!
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. మల్లన్న దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు పొంది మూడు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు శనివారం హైదరాబాద్‌కు చెందిన పి.వెంకటరఘురామరాయలు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు గంజి రవికి అందజేశారు. విరాళాన్ని అందించిన దాతను దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
మహానందిలో
భక్తుల సందడి
మహానంది: ప్రముఖ క్షేత్రమైన మహానందిలో శనివారం భక్తుల సందడి కనిపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడాయి. ఉదయం నుంచి ప్రారంభమైన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా కొనసాగింది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్‌నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 130 కళాశాలలో 4,842 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా అందులో 2,062 మంది పాస్ అయ్యారన్నారు. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం 2,892 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 2,005 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఒకేషనల్ 32 కళాశాలల్లో 446 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 285 మంది , సెకండియర్‌లో 292 మందికి గాను 259 మంది పాస్ అయినట్లు తెలిపారు.
శ్రీగిరి.. భక్తజన ఝరి!
శ్రీగిరి.. భక్తజన ఝరి!


