నేటి నుంచి ప్లంజ్‌పూల్ వద్ద సర్వే
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని ప్లంజ్‌పూల్ వద్ద మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు సర్వే నిర్వహిస్తున్నట్లు డ్యాం ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన గుంతలు, పగుళ్లపై సర్వే చేస్తారని చెప్పారు. పూణే నుంచి శాస్త్రవేత్తలు ఎం.ఎస్.బిస్ట్, అజయ్, డి.సోనవనే, వి.ఎన్.కట్టే, రీసెర్చ్ అసిస్టెంట్ రాకీ సర్వేలో పాల్గొన్నారని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు–2025కు అర్హులైన బాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారిణి స్వప్న ప్రియదర్శిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా రంగం, సామాజిక సేవా రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక సంప్రదాయాల్లో ప్రతిభ కనబరిచిన 18ఏళ్లలోపు బాలబాలికలు జూలై 31లోపు దరఖాస్తు వెబ్‌సైట్‌లో చేసుకోవాలని పేర్కొన్నారు.
రమణీయం.. వెండిరథోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం స్వామిఅమ్మవార్లకు వెండిరథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై అధిష్టింపజేసి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 220 మంది తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందించారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి చర్యలు తీసుకోవాలన్నారు. అటవీశాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్‌పై
విస్తృత ప్రచారం
మహానంది: పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జి.సుధాకర్ కుమార్ అన్నారు. మహానందిలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 1,575 యూనిట్ల లక్ష్యం కాగా 470 మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీతో పథకం అందిస్తుందని, ఆసక్తి కలిగిన వారు వినియోగించుకోవాలని సూచించారు. ఏఈ ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
105 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సంధర్బంగా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా మాట్లాడుతూ.. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే అక్కడిక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించామన్నారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులకు పంపామన్నారు. పూర్తి విచారణ జరిపి భాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అడిషినల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్‌బాబు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్లంజ్‌పూల్ వద్ద సర్వే


