
ధరల పతనం.. జీరో వ్యాపారం!
● మార్కెట్‌ఫీజు లేకుండానే
సరిహద్దులు దాటుతున్న ధాన్యం
● ముడుపుల వసూళ్ల కోసం చెక్‌పోస్టుల్లో
అనధికార వ్యక్తులు
కర్నూలు(అగ్రికల్చర్): రైతులు పండించిన పంటలకు ధరలు పతనం కావడంతో వ్యాపారుల లాభం కోసం, స్వప్రయోజనాల కోసం కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు జీరో వ్యాపారానికి గేట్లు ఎత్తాయి. ముడుపుల వసూళ్ల కోసం చెక్‌పోస్టుల్లో అనధికార వ్యక్తులను నియమించినట్లు విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీలో సాగైన వరి నెల రోజుల నుంచి రైతుల ఇంటికి వస్తోంది. ధర లేకపోవడంతో రైతుల నుంచి ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసి ‘జీరో’ పై సరిహద్దులు దాటిస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ముట్టచెబుతూ.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఆదాయం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదని, ఇందులో భాగంగానే ధాన్యం జీరోపై తరలించేందుకు గేట్లు తెరిచారనే విమర్శలు వస్తున్నాయి.
వ్యాపారుల అక్రమాలు ఇలా..
ధాన్యం క్రయవిక్రయాలపై 2 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. రైతులే స్వంతంగా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవడానికి తరలిస్తే ఎటువంటి ఫీజు ఉండదు. వ్యాపారుల నుంచి మాత్రమే ఫీజు వసూలు చేస్తారు. ధాన్యం క్వింటాలు ధర రూ.2,000 వరకు ఉంటోంది. లారీ సామర్థ్యాన్ని బట్టి 300 క్వింటాళ్ల వరకు లోడ్ చేస్తారు. లారీ ధాన్యం విలువ రూ.6 లక్షలు ఉంటుంది. నిబంధనల ప్రకారం 2 శాతం ప్రకారం రూ.12 వేలు మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడైనా సరే ఒక్కచోట ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వ్యాపారులు లారీకి రూ.12 వేలు ఫీజు చెల్లించడం మనసొప్పక మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ఇచ్చుకొని తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్కడక్కడ ముడుపుల కింద రూ.6000 పోయినా రూ.6000 మిగులు ఉంటుందనేది వ్యాపారుల ఉద్దేశం.
కర్ణాటకకు తరలుతున్న ధాన్యం...
పాణ్యం, నంద్యాల, శిరువెళ్ల, రుద్రవరం, బండిఆత్మకూరు తదితర మండలాల్లో పండించిన ధాన్యం కర్ణాటక రాష్ట్రానికి తరలుతోంది. ప్రధానంగా కర్ణాటకలోని సిరుగుప్పకు వెళ్తున్నట్లు సమాచారం.హైదరాబాద్‌కు కూడా కొంతమేర ధాన్యం వెళ్తోంది. ప్రధానంగా రాత్రి వేళల్లోనే రోజుకు 20 నుంచి 30 లారీల వరకు ధాన్యం ఎలాంటి మార్కెట్ ఫీజుల చెల్లించకుండా వెళ్తోంది. పాణ్యం, కర్నూలు మార్కెట్ కమిటీలకు చెందిన చెక్‌పోస్టుల్లో ఎక్కడో ఒక చోట మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా.. మామూళ్లు తీసుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలులోని చౌరస్తా చెక్‌పోస్టులో అనధికార వ్యక్తిని నియమించి ముడుపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక దృష్టి సారించాం
మార్కెట్ ఫీజు ఫీజు చెల్లించకుండా వ్యాపారులు ధాన్యాన్ని జిల్లా సరిహద్దు దాటించకుండా ప్రత్యేక స్క్వాడ్‌ల ఏర్పాటు చేశాం. జీరో వ్యాపారం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. – నారాయణమూర్తి,
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి