భ్రామరీకి లక్ష కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

భ్రామరీకి లక్ష కుంకుమార్చన

May 13 2025 12:21 AM | Updated on May 13 2025 12:21 AM

భ్రామరీకి  లక్ష కుంకుమార్చన

భ్రామరీకి లక్ష కుంకుమార్చన

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్ర నామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి 26 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు చెబుతున్నారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని సంతాన సౌఖ్యం కలుగుతుందన్నారు.

మార్కుల జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోండి

నంద్యాల(న్యూటౌన్‌): పదో తరగతి మార్కుల జాబితాను www. bsc.ap.gov.in అందు బాటులో ఉందని, విద్యార్థులు డోన్‌లోడ్‌ చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరిగాయన్నారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఫలితాలు వచ్చాయన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా దిద్దుబాట్లు ఉన్నట్లు అయితే ఒరిజినల్‌ పాస్‌ సర్టిఫికెట్లలో సవరణలు అమలు చేయడానికి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దృష్టికి తెలియజేయాలన్నారు. అడ్మిషన్‌కు సక్రమంగా పాఠశాలల రికార్డులను జోడించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సంక్షిప్తం మార్కుల జాబితా పత్రం ఈనెల 25వ తేదీలోగా సమర్పించాలని డీఈఓ తెలిపారు.

17న పాణ్యంకు సీఎం రాక

పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్‌ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్‌ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డి కలిసి హెలిపాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్‌ ఎదురుగా ఉన్న ప్రయివేట్‌ వెంచర్‌ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్‌డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

67 మందికి గ్రేడ్‌–2

కార్యదర్శులుగా పదోన్నతి

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్‌ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు.

దొర్నిపాడులో

41.6 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ అనుపమ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement