
రాష్ట్రంలో రాక్షస పాలన
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానవీయమన్నారు. కూటమి నేతల మెప్పు కోసం పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. మాజీ మంత్రి, ఒక మహిళ అని చూడకుండా ఆమైపె సీఐ దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐ సుబ్బనాయుడును సీఐ గారు..అని సంభోదించినప్పటికీ ఆమెను కారులో నుంచి బైటికి లాగి కిందకు దింపటం ఎంత దుర్మార్గమన్నారు. ఇటీవల గుంటూ రు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, నైటీ మార్చుకుని చీరతో వస్తానని ఆమె బ్రతిమాలినా వినకుండా.. చీర కారులోనే మార్చుకోమని పోలీసులు చెప్పడం ఎంతటి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన రాక్షసపాలనను తలపిస్తుందని, ఇలాగే కొనసాగితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కూటమి నేతలు రెడ్ బుక్ పాలనను మాత్రం సజావుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, అధికార పత్రినిధి అనిల్ అమృతరాజ్, మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ కృష్ణమోహన్, నాయకులు లక్ష్మీనారాయణ, సాయిరామ్‌రెడ్డి, రహంతుల్లా, భాస్కర్‌రెడ్డి, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా